నా పెదాలపై సుస్వరం
మనసులో అహంకారం
పైకేమి అనలేక
పదాలుతో పదనిసలాడుతున్నాను
నా పెదాలుకు ఎన్ని పంటి గాట్లో !
****
చెప్పినట్టు చెయ్యను
చేస్తున్నట్టు చెప్తాను
పైకి మౌనం
మనసులో క్రోధం
ముసుగులో నేను
పెదాలుపై నా నవ్వు
రాజకీయనాయకుడిని కాదండోయ్!
***
ముఖానికి రంగేసుకున్నా!
మనసు రంగులు మారుస్తుంది
చీకట్లో మాటలు
పగలు చేష్టలు
రాత్రి నాదే
పగలు నాదే
లోకమే చీకటి !
***
వర్మలో ఇద్దరు
అనగనగా ఒకరోజు
క్షణ క్షణం
రక్త చరిత్ర
వారిద్దరు (నేను మాత్రం ఇద్దరిని)
రామ్ గోపాల్ వర్మ
కె.ఎన్.వి.ఎం.వర్మ
ఒకటి గాయం
రెండు కోణం
****
ఉబికి వస్తున్న కన్నీళ్లను
దాయడానికి నా కనురెప్పలు
ఎంత ప్రయత్నిస్తున్నా
మనసు బాధ అదిమిపట్టడానికి
నా గొంతు జీరబోతున్నా
పదాలు పలకలేక
పెదాలు కొరుక్కున్నా
ఊపిరి భారంగా తీస్తున్నా
గుండె లయ పెరుగుతున్నా
ఒంటిపై చలి పొక్కులు వస్తున్నా
వెన్నులో చలి పుడుతున్నా
కాళ్ళు అదురుతున్నా
ఒళ్ళు బెదురుతున్నా
నేను మాత్రం ముసుగేసుకున్న మనిషినే
నా మనసుకు దుప్పటి తీస్తే
నాలో నేను -నా మధ్యలో నీడ
ప్రతిక్షణం నా నీడను చూసుకుంటూ
అదురుతూ- బెదురుతూ -నటిస్తూ
ఎస్ నేనంటే నేనే !
ఏదో తెలీని వెలితి గుండెలను పిండేస్తుంది
బహుశ ఏదైనా శేషం
నాలో మిగిలిపోయిందా
అవశేషంగానే ఉండిపోతున్నాను
అంతరాత్మను ఎంత తొలిచినా
వొలిచినా జ్ఞప్తికి రావడం లేదే
ఎందుకీ అంతర్మధనం
మెదడులో ప్రకంపనాలు
ఏమయ్యింది ...ఏం జరిగింది
ఆలోచించినా... మెదడు చించుకున్నా
తర్కిన్చుకున్నా
నాలో ఇంకా ఏదో వెలితి తొలిచేస్తుంది
భారంగా...బాధగా
మనసు ఘర్షణ పడుతూనే ఉంది
సంఘర్షణలతో సతమవుతూనే ఉంది
నాలో నేను ... నాతో నేను
స్కానింగ్ చేసి చూసాను
నిజమే ఏదో వెలితి
మనసు పెట్టె బాధ
అదిమి పెట్టె బాధ
అవును! నాలో రెండు కోణాలు
రెండూ వ్యతిరేక ప్రకంపనాలు
ఒకటి నాతో
రెండు మీతో
అందుకే నా మనసుకు లేదు శాంతి
జీవితమంతా అశాంతి
ఏదో వెలితి !!!
నీతో ఉండాలని నీతో నడవాలని
నీతో గడపాలని
నీతో మాట్లాడాలని
నీతో నే ఉండాలని
నువ్వు నాతోనే ఉండాలని
ఎన్ని కలలో... ఎన్నెన్ని కలలో..!
నువ్వు నాతో ఉన్నప్పుడు
నువ్వు నాతో నడిచినప్పుడు
నువ్వు నాతో గడిపినపుడు
నువ్వు నాతో మాట్లాడినప్పుడు
ఈ ప్రపంచాన్ని విడిచి ఇద్దరు దూరంగా వెళ్ళినప్పుడు
ఏకాంతం గా ఇద్దరం ఊసులు చెప్పుకున్నప్పుడు
నీ ప్రేమను పంచి ఇచ్చినప్పుడు
ఎన్ని కలలో... ఎన్నెన్ని కలలో..!
కలలన్ని నిజాలైతే ఎంత బాగుండునో ?
హలో !ఒక్క మాట!
సచివాలయం లో
ప్రభుత్వం నిద్రపోతుందట!
తుమ్మితే ఊడే ముక్కు కదా
నిద్రలోనే ఉంటుందిలే !
ష్ !గప్ చుప్ .
****
హలో !ఇంకో మాట!
ప్రతిపక్షాలు టర్నింగ్ లో ఉన్నాయి
టర్న్లులు మీద టర్న్లు తీసుకుని
రోజుకో యాత్ర
రోజుకో దీక్షా లతో
శవయాత్రాలు చేస్తున్నాయి
***
హలో !మరో మాట!
స్విచ్ ఆన్ ఆఫ్ లతో ఫ్యాన్
పంక్చర్ లతో సైకిల్
నీరులేని కమలం
బ్రేకుల్లేకుండా కారు
భలే జోరుగున్నాయి
జరా భద్రం కొడుకో !
****
హలో! చివరిగా మాట!
ఎర్ర రంగు
వెర్రిగా మారింది
ఎర్ర నాయకత్వం
ప్రజలను "ఎర్రో ళ్ళు" చేస్తుంది
ప్రజల పేరుతో వచ్చిన పార్టీ కి
ప్రజలే లేకుండా పోయారు
పార్టి దిమ్మలు రంగు మారిపోయాయి
***
ఇంతకు మనది ఏ రాష్ట్రం
రగిలే రాజ్యం
రావణ రాష్ట్రం
కీచక పర్వం
దీక్షల రాష్ట్రం
కీలు బొమ్మల రాజ్యం
కీలక రాష్ట్రం
(గొర్రె కటిక వాడినే నమ్ముతుంది )
ఒకరు ఇటుపక్క
మరొకరు అటుపక్క
ఇద్దరు దొంగలే
బలిపశువులు ప్రజలే !
***
నిన్నో మాట
నేడో మాట
పూటకో మాట
గంటకో నోట
నోరు నొప్పి ప్రజలకే !
***
నిప్పూ వారిదే
నీరు వారిదే
మంట వారిదే
రగిలేది ప్రజలే !
***
నోటి మాటలు
నీటి మూటలు
గుప్పెట్లో దాగవు
దాచినా ఆగవు
దోచుకునేది ప్రజలనే!
****
ఒకపక్క రణరంగం
మరో పక్క ఆనందం
చోద్యం లో నాయకులు
నలుగుతున్న ప్రజలు!
****
గమ్ములా నాయకులు
వదలరు పదవులు
అంటిపెట్టుకునే కుర్చీ
అంటించుకుంటారా
మాయ మాటలు చెప్పి
తప్పించుకుంటారా
తానా! తందానా!!
ఇంగ్లీషులో బుర్రకధ
తెలుగులో డబ్బింగ్
ప్రేక్షక పాత్రలో ప్రజలు!
****
నిజమే చెప్తున్నా!
నీకు నమ్మకం లేదా?
నిజమే రాస్తున్నా
ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా ?
అవున్లే !
పిల్లగాలి తుంపరలు... ప్రేమ పరవళ్ళు
శృంగార సరసాలు ... తుమ్మెదలు
సరదాలు... షోకులు... రసరమ్య రసాలు
నా రాతల్లో ఉండవు కదా!
అందుకే నీకు నమ్మకం లేదు
నిజమే చెప్తున్నా!
నా రాతల్లో జీవితాలు చూడు
జీవనాలు చదువు
అతుకుల బతుకులు
గొడుగులేని బడుగులు
ఆక్రందనలు... ఆవేదనలు...అన్నార్తనాదాలు
బతుకు చిత్రంపై ఛత్రం లా
నివురుగప్పిన నిప్పులా
మాటలే తూటాలై
నికరంగా నిర్భయంగా
అక్షర సత్యాలు పలికిస్తా
అందుకే నీకు నమ్మకం లేదు
మండే కత్తి(కత్తిమండ)లా
కలాల్ని పండిస్తా !
నమ్ము నమ్మకపో
పదాల పదనిసలై
జీవిత సరాగాలు
కన్పిస్తాయి... అందుకే
నీ కళ్ళకు అద్దాలు అవసరమే !!!
దయలేని ఓ! మాతృ మూర్తి
ఒక్క సారి వెనుదిరిగి చూడమ్మా
నీ ప్రతిబింబం ఎక్కడిదో
కన్నపేగు నిన్ను వద్దనుకుందా
అమ్మ తనం నిన్ను మరిచిందా
మానవత్వం నిన్ను మంట గలిపిందా
నవ మోసాలు మోసిన
నిన్ను అవమానాలు చేసిందా
ఆడదానిగా పుట్టినందుకు
అవనికి భారమనుకుందా
కమ్మనైన అమ్మ తనాన్ని మరిచి
నిర్దాక్ష్యం వదిలి
కాఠిన్యమైన
కర్కశ హృదయంతో
ఆడతనాన్ని మరిచి
ఒంటరి ని చేసి వెళ్తావా
నీకిది న్యాయమా
నాకు శాపమా
ఓ!మాతృ మూర్తి
ఒక్క సారి వెనుదిరిగి చూడమ్మా
నీ ప్రతిబింబం ఎక్కడిదో ?!
(చెత్త కుప్పలో పసికందుని వదిలి వెళ్ళిన అమ్మ... వార్త చదివి )
అబద్ధాన్ని బద్దలు కొడితే నిజం బయటకొస్తుంది
నీ నైజం బయట పడుతుంది
నిజం లో అబద్దం
అబద్ధం లో నిజం
రెండు ఒకే ఇజం !
****
నీ మనస్సాక్షిని అడుగు
నిజం చెప్పమని
భయపడుతుంది
నీ అంతరాత్మను అడుగు
నిజం చెప్పమని
భయపెడుతుంది
నీ నీడను అడుగు
నిజం చెప్పమని
భయపడుతూ ... భయపెడుతుంది
****
పెదాలపై మాటలు
మనసులో నిజాలు
ఒక్కటికావు!
పెదాలుపై నిజాలు
మనసులో మాటలు
ఒక్కటే !
****
నిజం లో నువ్వు
అబద్ధం లో నేను
అద్దం లో నువ్వు
పగిలిన అద్దం లో నేను
ప్రతిబింబం లో నువ్వు
ప్రతి రూపాల్లో నేను!!!
గమ్యం తెలీని నేను
జీవిత గమనంలో ఓడిపోయాను
దిశా- నిర్దేశం లేని నేను ఒంటరిగా
మిగిలిపోయాను
లక్ష్యం లేని నేను
లక్షల మైళ్ళ దూరంలో
వెనక్కి ఉండిపోయాను
గెలుపోటములు
నన్ను గేలిచేసాయి
బీటలు తీసిన బాటలు
బ్రహ్మ జెముడు మొక్కలు
తుమ్మ ముళ్ళ చెట్టులు
వెంటాడే జ్ఞాపకాల్లా -
ఎదురుపడి వెక్కిరిస్తుంటే
జీవన గమనం జీవితాన్నే వెక్కిరించింది
ఆలోచనల తేనెటీగలు
మెదడును గుచ్చుతుంటే
గతమే గుణ పాఠమై
వర్తమానం ఆలోచనై
భవిష్యత్తుకు మార్గం చూపించాయ్
శిధిలమైన జ్ఞాపకాల్లోనుంచి
తొంగి చూస్తున్న నాకు
పరమపద జీవన సోపానంలో
పాము కాటులు
పట్టుదలను నింపాయి
ఇప్పుడు నిచ్చెనెక్కిన నాకు
ఓటమి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో
తొంగి చూస్తుంది నాకు భయపడుతూ ...
మారని గాయం – రక్త శాసనం
Posted by admin on February 24th, 2013 04:08 PM | కవితలు
రక్త శాసనం!

ముక్కలైన శరీరాలు
తెగిపడిన దేహాలు
అలసిన ఆహాకారాలు..
కన్నీళ్లను మూట గట్టి
కన్న పేగుల ను తెంచి
పైశాచిక బాంబు దాడి.
ఎందుకురా! ఈ ఆటలు
నరమేధ రక్త చరిత్రలు
చలించదా! నీ హృదయం
చావదా! నీ దారుణం
ఆగదా! నీ రణం
ఎవడికోసం .. ఎందు కోసం
తర తరాల రాపిడి
నరనరాల దోపిడి
అమాయకత్వం పైన మీ దాడి..
క్రూరులారా! నీచులారా !!
మానవత్వం మరిచిన
దగా కోరులారా !
పైశాచికత్వ మూర్ఖులారా!
బరితెగించిన బడవలారా!
బల సత్వం మీదిరా
బలి పశువులు మేమురా!
ఇంకాన ..
ఇకపై
సాగవు మీ ఆటలు
దాగవు మీ నీడలు
మారని గాయం
ఆరని మంట
రగిలే పౌరుషం
ఉగ్రవాద నాశనం
భారతీయ శాసనం
అదే మా రక్త శాసనం.
– ప్రతాప్
(బాంబు దాడి లో బలైన అమాయకులకు నివాళి అర్పిస్తూ .. )
Pinterest
- See more at: http://sevalive.com/sahithya/?p=563#sthash.Abo9OibK.dpuf
తాకట్టు జీవితాలు
Posted by admin on May 8th, 2012 12:37 PM | కవితలు

కూడు-గూడు -గుడ్డ లేని
నా సంపూర్ణ పేదరికానికి
తలసరి ఆదాయం లెక్క కట్టి
సాపేక్ష పేదరికం లో నన్ను చేరిస్తే
నా ఆకలి అన్నార్త నాదాలు
తీర్చే వారెవరు ఎవరికెరుక ?
తప్పుల తడకల ఆర్ధిక వ్యవస్థలో
ఏసి ల్లో కూర్చుని ఇచ్చే జివో ల్లో
ఎండమావుల జీవితాలే కనిపిస్తాయి
ఆర్ధిక జీవన ప్రమాణాలు
తెలీని నీ బొక్కల లెక్కలు
మా రెక్కల తాకట్టు పెట్టే
నీ ప్రపంచ బ్యాంకుకే పనికొస్తాయి.
ఈ పనికిమాలిన ప్రవచనాలు
దగ్గరకొస్తే నిజాలు ఇజాలవుతాయి
రూపాయికి విలువలేని ఈ దేశంలో
క్రూరమైన విధి విధానాలకు
కొదువలేదు
అశాస్త్రీయ ఆర్దికమే నీకు నిజం
ఒక్కసారి మా ఆకలి చవి చూడు
డొక్కాడని మా రెక్కలు చూడు
చిరిగిన చితికిన జీవితాలు
కనిపిస్తాయి .
Pinterest
- See more at: http://sevalive.com/sahithya/?p=359#sthash.504tAAmp.dpuf
ఓ! బాటసారి
Posted by admin on May 27th, 2012 12:59 AM | కవితలు

బీటలు తీసిన బాటలు
బ్రహ్మా జెముడు మొక్కలు
ముళ్ళపొదలు
పాకుతున్న పాములాగా
సాగుతున్న రహదారి
గమ్యం వెతుక్కుంటూ
బాటసారి
కళ్ళల్లో ధైర్యం
కాళ్ళల్లో అధైర్యం
మాటల్లో ధైర్యం
చేతల్లో అధైర్యం
ఆలోచనలు బలం
ఆచరణ శూన్యం
వెనక్కు లాగుతున్న
అంతరాత్మ
-కత్తిమండ ప్రతాప్
Pinterest
- See more at: http://sevalive.com/sahithya/?p=412#sthash.7PqWSesx.dpuf